అయోధ్యపై మధ్యవర్తిత్వం కమిటీ

  0
  8

  సంప్రదింపులకు ముగ్గురు ప్రముఖులను నియమించిన సుప్రీంకోర్టు
  విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఖలీఫుల్లా ఆధ్వర్యంలో మండలి
  సభ్యులుగా శ్రీశ్రీ రవిశంకర్‌, న్యాయవాది శ్రీరాం పంచు

  అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో శుక్రవారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ముగ్గురు మధ్యవర్తులను నియమిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఫకీర్‌ మహ్మద్‌ ఇబ్రహీం ఖలీఫుల్లా అధ్యక్షతన ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌, సీనియర్‌ న్యాయవాది శ్రీరాం పంచు సభ్యులుగా ఈ మధ్యవర్తిత్వ మండలి ఏర్పాటయింది.

  ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి, జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌లతో కూడిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలిచ్చింది. కక్షిదారులు సూచించిన మేరకు వీరిని ఎంపిక చేసినట్టు తెలిపింది.

  మధ్యవర్తుల మండలిని నియమించడానికి చట్టప్రకారం ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేసింది. సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికిగల అన్ని అవకాశాలనూ అన్వేషించాలని మండలిని ఆదేశించింది. ఇందుకు సంబంధించి విధివిధానాలను సూచించింది.

  విధివిధానాలు

  * వారం రోజుల్లోగా కార్యకలాపాలను ప్రారంభించాలి.
  * అవసరం ఉంటే మరికొందరిని కో-ఆప్టెడ్‌ సభ్యులుగా నియమించుకోవచ్చు.
  * ఈ చర్చలన్నీ అయోధ్యకు ఏడు కిలోమీటర్ల దూరంలోని జిల్లా కేంద్రమైన ఫైజాబాద్‌లోనే జరగాలి. ఇందుకోసం ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలి.
  * కార్యకలాపాలన్నీ రహస్యంగానే జరగాలి.
  * ఇందుకు సంబంధించిన వివరాలను పత్రికల్లో ప్రచురించడానికిగానీ, టీవీల్లో ప్రసారం చేయడానికిగానీ వీల్లేదు.
  * సంప్రదింపుల సమయంలో అత్యంత గోప్యత పాటించాలి.
  * నాలుగు వారాల తరువాత సంప్రదింపులు జరుగుతున్న తీరుపై నివేదిక సమర్పించాలి.
  * ఏవైనా ఇబ్బందులు తలెత్తితే సుప్రీంకోర్టు రిజస్ట్రీ దృష్టికి మధ్యవర్తిత్వ మండలి ఛైర్మన్‌ తీసుకురావాలి.
  * మధ్యవర్తిత్వానికి సంబంధించి ప్రస్తుతం అమల్లో నిబంధనల ప్రకారమే కార్యకలాపాలు నిర్వహించాలి.
  * మొత్తం కార్యక్రమాలను 8 వారాల్లో పూర్తి చేయాలి.