అత్యాధునిక చాపర్లు కొనుగోలు చేయనున్న భారత్

  0
  10

  భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. అమెరికా నుంచి భారత్ యూఎస్ మల్టీ రోల్ ఎమ్హెచ్ 60 ‘రోమియో’ యాంటీ సబ్మెరైన్ హెలికాఫ్టర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబర్చినట్లు వాషింగ్టన్లోని రక్షణ శాఖ తెలిపింది. వీటి ధర 2 బిలియన్ అమెరికా డాలర్లు.

  ఈ తరహా హెలికాఫ్టర్ల కోసం భారత్ గత పదేళ్లుగా వేచిచూస్తోంది. దీనికి సంబంధించిన ఒప్పందం కొన్ని నెలల్లో జరుగుతుందని అమెరికా రక్షణశాఖ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ సింగపూర్ లో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ను కలిసిన తర్వాత హెలికాఫ్టర్ల కొనుగోలుపై స్పష్టత రావడం విశేషం.
  భారత రక్షణ శాఖ అవసరతలను గ్రహించిన అమెరికా ఈ తరహా హెలికాఫ్టర్లు కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం ముందు ప్రతిపాదించింది. కొన్ని నెలలుగా దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇక సింగపూర్ వేదికగా జరిగిన మోడీ – పెన్స్ భేటీలో ద్వైపాక్షిక రక్షణ బంధమే ప్రధాన అజెండాగా నిలిచింది. ప్రస్తుతం ఈ హెలికాఫ్టర్లు అమెరికా నేవీలో సేవలందిస్తున్నాయి. లాక్హీడ్ మార్టిన్ ఎమ్హెచ్ -60R సీహాక్ హెలికాఫ్టర్లు ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతికత కలిగిన సముద్రపు హెలికాఫ్టర్లుగా పేరుగాంచాయి.

  రక్షణ శాఖ నిపుణుల ప్రకారం ఈరోజు ఉన్న నేవీ హెలికాఫ్టర్లలో రోమియో హెలికాఫ్టర్లు అత్యాధునికమైనవని చెప్పారు. ఇందులోని ఆయుధ వ్యవస్థ శత్రువులను, వాటి జలాంతర్గాములను,యుద్ధనౌకలను ధ్వసం చేయగల సత్తా లేదా సామర్థ్యం రోమియో హెలికాఫ్టర్లకున్నాయని చెప్పారు. భారత మహా సముద్రం తీరంలో చైనా నుంచి భారత్ కు ముప్పు ఉన్నందున భారత్ కు ఈ తరహా హెలికాఫ్టర్లు ఎంతో అవసరమని వారు చెబుతున్నారు.