అతిపెద్ద మూడో వినియోగ విపణిగా భారత్‌ : ప్రపంచ ఆర్థిక వేదిక

  0
  16

  అమెరికా, చైనా తర్వాత అతిపెద్ద మూడో వినియోగ విపణిగా భారత్‌ అవతరించబోతోందని ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) తన నివేదికలో అంచనా వేసింది.

  # దేశీయంగా వినియోగదారుల వ్యయాలు పెరుగుతుండటం ఇందుకు కారణంగా విశ్లేషించింది. ప్రస్తుతం దేశీయ వినియోగదారుల వ్యయాలు 1.5 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.105 లక్షల కోట్ల) నుంచి 2030 నాటికి 6 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.420 లక్షల కోట్ల)కు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.

  # ప్రస్తుతం 7.5 శాతం వార్షిక జీడీపీ వృద్ధి రేటుతో భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద 6వ ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని పేర్కొంది. 2030 నాటికి దేశీయ ప్రైవేటు వినియోగం దేశ జీడీపీలో 60 శాతానికి చేరొచ్చని, అప్పటికి వినియోగదారుల విపణి 6 లక్షల కోట్ల డాలర్లకు సులువుగా చేరుకోగలదని అభిప్రాయపడింది.

  # వినియోగంలో గణనీయ వృద్ధి నమోదయ్యే అవకాశం ఉన్నా, అదే సమయంలో భారత్‌ క్లిష్టమైన సామాజిక సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చనీ డబ్ల్యూఈఎఫ్‌ తెలిపింది. ప్రధానంగా నైపుణ్యా అభివృద్ధి, భవిష్యత్‌ తరాలకు ఉపాధి కల్పించడం, సామాజిక, ఆర్థిక కోణంలో గ్రామీణ భారతాన్ని భాగస్వామ్యం చేయడం, ఆరోగ్యక్శ, స్థిర భవిషత్తును పౌరులకు అందించడం వంటి సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని పేర్కొంది.

  # భారతీయుల ఆదాయం ఇటీవల బాగా పెరుగుతుండటంతో పేదరికం నుంచి మధ్య తరగతి ఆర్థిక వ్యవస్థగా భారత్‌ రూపాంతరం చెందుతోందని తెలిపింది.

  # భవిషత్తు భారతంలో వినియోగదారుల మార్కెట్‌ వృద్ధి ఎక్కువగా ధనిక, జన సాంద్రత కలిగిన నగరాల నుంచి, అభివృద్ధి చెందుతున్న వేలసంఖ్యలోని చిన్న పట్టణాల నుంచే ఉంటుందని పేర్కొంది.

  # ఇందులో ప్రధానంగా 40 అగ్ర నగరాల నుంచే 2030 నాటికి 1.5 లక్షల కోట్ల డాలర్ల వినియోగదారుల మార్కెట్‌ ఉండొచ్చని అభిప్రాయపడింది.

  # బెయిన్‌ అండ్‌ కంపెనీ సహకారంతో 30 నగరాలు, పట్టణాల్లోని 5,100 వినియోగదారులతో మాట్లాడి, 40 మందికిపైగా ప్రైవేటు, ప్రభుత్వ రంగంలోని ప్రముఖులను ఇంటర్య్వూలు చేసి క్రోడీకరించిన సమాచారంతో డబ్ల్యూఈఎఫ్‌ ఈ నివేదికను రూపొందించింది.